ప్రభుత్వపాఠశాలల్లోమెరుగైన సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే గణేష్
శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం , నవంబర్ 14( జన హృదయం): పిల్లలందరూ బడికి వెళ్లి మధ్యలో మానకుండా ఉండాలంటే వారికి అవసరమైన సమస్త సదుపాయాలను నూటికి నూరు శాతం కల్పించే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. గురువారం పెద్ద బొడ్డేపల్లి వద్ద గల ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో మూడు దశలలో తొమ్మిది రకాల సదుపాయాలను మూడు సంవత్సరాల పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో గల 230 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మొదటి దశలో 103 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన పాఠశాలలో మరుగుదొడ్లు , ఫ్యాన్లు , ట్యూబ్ లైట్లు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మత్తులు, ఫినిషింగ్, బ్లాక్ బోర్డులు, రక్షిత త్రాగునీరు, ఇంగ్లీష్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అన్ని పాఠశాలలో బోధన ప్రమాణాలను పెంచడానికి ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణను అందించడం జరుగుతుందన్నారు. వచ్చే సంవత్సరం నుండి ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం లో బోధన చేయడం జరుగుతుందన్నారు . తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరిగా బోధించడం జరుగుతుందన్నారు . ఈ ఏర్పాట్ల వలన విద్యార్థులలో నైపుణ్యాలను పెంచడం జరుగుతుందన్నారు.
దశలవారీగా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధికి ముందు , అభివృద్ధికి తరువాత నాడు - నేడు ఫోటోలను తీయడం జరుగుతుందన్నారు. నవంబర్ 14 వ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పధక అమలుకు సంబంధించి సుమారు 12 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు.
రెవెన్యూ డివిజనల్ అధికారి రోణంకి గోవింద రావు మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లో కన్నా పాఠశాలలోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉన్నందున , మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన , విద్యార్థులను ఆకర్షించే విధంగా రూపొందించడం ద్వారా భవిష్యత్తులో వారిని మంచి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు.
బాలల దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనల తో ఆహుతులను అలరించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణి, నియోజకవర్గ నాలుగు మండలాల ఎం ఈ ఓ లు , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు , నర్సీపట్నం మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.
Comments
Post a Comment