ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మొండిపట్టు
కార్మికులతో చర్చలు జరపలేమని స్పష్టీకరణ
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని అడిషనల్ ఏజీ రాంచందర్‌రావు హైకోర్టుకు తెలిపారు. కార్మికులు చట్ట ప్రకారం నడుచుకోలేదని, ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఏజీ కోర్టుకు తెలిపారు. ''ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టే ప్రభుత్వం ఆర్థికంగా ఎంతగానో ఆదుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేం. సమ్మె కారణంగా ఇప్పటి వరకు ఆర్టీసీ కార్పొరేషన్ 44 శాతం నష్టపోయింది. ఇక ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం. యూనియన్ నేతలు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినా తిరిగి ఏ క్షణమైనా మళ్లీ ఆ డిమాండ్‌ను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం సంస్థనే నష్టాల్లోకి నెడుతున్నారు. యూనియన్ నేతలు పనిగట్టుకుని ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 22(1)ఏ ప్రకారం సమ్మె చట్ట విరుద్ధం. సమ్మెకు వెళ్లేముందు కార్మికులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు'' అని ఏజీ హైకోర్టుకు విన్నవించారు.
మరోవైపు, రాష్ట్రంలో క్రమంగా ప్రజారవాణా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుతున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో యాజమాన్యం అన్ని రూట్లకు బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో పెద్ద సంఖ్యలో బస్సులను నడిపిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 వరకు 69 శాతం (6,114) బస్సులు నడిచినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 4,189 ఆర్టీసీ, 1,925 అద్దె బస్సు లు ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం 4,189 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,114 మంది తాత్కాలిక కండక్టర్లు విధులు నిర్వర్తించినట్టు వివరించారు. వరంగల్ రీజియన్‌లో బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో మారుమూల ప్రాంతాలకు సైతం బస్సు లు నడుపుతున్నారు. రీజియన్‌లోని తొమ్మిది డిపోల నుంచి ఆదివారం 680 బస్సులు వివి ధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేశాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 492 బస్సులు నడిచాయి. కరీంనగర్ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో 651 బస్సులు నడపాల్సి ఉండగా 643 బస్సులు తిరిగాయి. మెదక్ రీజియన్‌లోని మూడు జిల్లాల్లో 490 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. ఖమ్మంలో 69 ఆర్టీసీ , 57 అద్దె బస్సులు, సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ 66, 35 అద్దె బస్సులు, మధిర డిపోలో 24 ఆర్టీసీ, 19 అద్దె బస్సులు వివిధ ప్రాంతాలకు తిరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 230 బస్సు సర్వీసులు తిరిగాయి. నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 278 బస్సులు నడిచాయి.
సూర్యాపేట డిపో పరిధిలో 28 ఆర్టీసీ, 44 అద్దె బస్సులు, కోదాడ డిపో నుంచి 44 ఆర్టీసీ, 30 అద్దె బస్సులు, యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ఆదివా రం 63 ఆర్టీసీ, 14 అద్దె బస్సులు నడిచాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 45 ఆర్టీసీ, 35 అద్దె బస్సులు, నారాయణపేట జిల్లాలో 52 ఆర్టీసీ, 29 అద్దె బస్సులు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 148 ఆర్టీసీ, 80 హైర్ బస్సు లు తిరిగాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 298 బస్సు లు నడిచాయి. వికారాబాద్ జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు బస్ డిపోల నుంచి హైదరాబాద్, మహబూబ్‌నగర్, సదాశివపేట, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాలకు 177 బస్సులు నడిచాయి.
Comments
Post a Comment