రాష్ట్రంలో వైయస్ఆర్ నవశకం నవంబరు 20 నుండి డిసెంబరు 20 వరకు
• పథకాల వర్తింపునకు సర్వే అనంతరం డేటా కంప్యూటరీకరణ అవసరం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ప్రభుత్వ పథకాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
విశాఖపట్నం (జన హృదయం): రాష్ట్రంలో వై.యస్.ఆర్. నవశకం కార్యక్రమం నవంబరు 20వ తేదీ నుండి డిసెంబరు 20వ తేదీ వరకు సంక్షేమ కార్యక్రమాలకు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపికపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్దిదారుల ఎంపికకు పథకాల వారీగా మార్గదర్శకాలు విడుదల చేయడమైనదని, ఎంపికైన అర్హులకు బియ్యం కార్డు, వై యస్ ఆర్ ఆరోగ్య శ్రీ, వై యస్ ఆర్ పింఛను, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు కొత్త కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు కొనసాగుతాయని, వీటితో పాటు వై యస్ ఆర్ మత్స్యకార భరోసా, వై యస్ ఆర్ నేత్ర నేస్తం, జగనన్న అమ్మ ఒడి, కాపు నేస్తం, దర్జీ, రజక, నాయి బ్రాహ్మణ లబ్ది పథకాలు, సున్నా వడ్డీ, ఇమామ్, పాస్టర్ ల పారితోషకం, అర్చకుల వేతనం పెంపు కార్యక్రమాల ఎంపిక జరగాలన్నారు. ఎంపిక పక్కగా జరగాలని, రోజువారీ డేటా కంప్యూటరీకరణ చేయాలని తెలిపారు. ఎం.పిడి.ఓ లు, మున్సిపల్ కమీషనర్ లు పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని, సోషల్ ఆడిట్ చేసి గ్రామ సభలలో ఎంపిక కార్యక్రమం వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపికపై వాలంటీర్లు, సంబంధిత సిబ్బందికి శిక్షణ కల్పించాలని, మండలాలకు మాస్టర్ ట్రైనర్ లను ఎంపిక చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో లబ్ధిదారుల తొలగింపు జరగదని, అర్హులైన మరింతమంది చేరాలని చెప్పారు. గృహాలను సక్రమంగా మేపింగ్ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి నెలకు 10 వేల రూపాయలు కాగా, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయలు ఉంటున్నట్లు వివరించారు. విద్యుత్ నెలకు 3 వందల యూనిట్లు వరకు వినియోగించినా అర్హులేనని, ట్రాక్టర్లు, టాక్సీలు, ఆటోలను కలిగినా కూడా మినహాయింపు ఉంటుందని, సంబంధిత శాఖల నుండి ముందుగా వివరాలు తీసుకుని లబ్దిదారుల వద్దకు వెళ్లి విచారణ చేసి నిర్దారణ చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులందరూ అర్హులేనని, నవ రత్నాల క్రింద అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్, గ్రామీణ మరియు పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ గరిజా శంకర్, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్థి శాఖ కమీషనర్ కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన, ఇన్ చార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓ ఎం. శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ - 2 ఎం.వి. సూర్యకళ, జడ్పీ సీఈవో రమణమూర్తి పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ జెడి మల్లికార్జునరావు, సాంఘిక సంక్షేమశాఖ డిడి జయప్రకాష్, డ్వామా పీడీ పి. సందీప్, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, సిపిఓ, జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ ఉప సంచాలకులు తనూజ రాణి, పంచాయతీ రాజ్ ఎస్ ఇ సుధాకర్ రెడ్డి, డిపిఓ కృష్ణ కుమారి, డిఎంహెచ్ఓ తిరుపతిరావు, డి ఎస్ ఓ లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment