ఫెడరల్ వ్యవస్థకు రాజ్యసభ ఆత్మ: మోదీ
తొందరపడి చట్టాలు మార్చొద్దన్న మన్మోహన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలు చోటుచేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభ చరిత్ర సృష్టించిందని, ఎన్నో చరిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యంగా కూడా నిలిచిందన్నారు. రాజ్యసభకు ఎంతో ముందు చూపు ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభ 250వ సెషన్ సందర్భంగా సోమవారం ప్రధాని మోదీ మాట్లాడారు.
రాజకీయాలకు దూరంగా ఉన్న వారు కూడా రాజ్యసభ ద్వారా దేశ సేవలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. దేశాభివృద్ధిలో అలాంటి వారి కూడా రాజ్యసభ ద్వారా ఉపయోగపడుతున్నట్లు మోదీ తెలిపారు. భిన్నత్వ లక్షణాల వల్ల రాజ్యసభ వర్థిల్లిందన్నారు. రాజ్యసభ 250వ సమావేశాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు వచ్చారన్నారు.
ఫెడరల్ వ్యవస్థకు రాజ్యసభ ఆత్మవంటిదన్నారు. రాజ్యసభ ఎన్నో కీలక బిల్లులను పాస్ చేసిందన్నారు. దేశం మంచి కోసం రాజ్యసభ ఎప్పుడూ ముందు ఉండి నడిచిందన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం కాదన్న అభిప్రాయం ఉండేది. కానీ ఆ బిల్లు రాజ్యసభలో పాసైందని మోదీ గుర్తు చేశారు. జీఎస్టీ బిల్లుకు కూడా ఇదే సభలో ఆమోదం దక్కిందన్నారు. దేశ సంక్షేమం కోసం పనిచేసే విధంగా మన రాజ్యాంగం స్పూర్తినిస్తోందన్నారు. సహకార సమాఖ్య స్పూర్తికి రాజ్యసభ మరింత ఊతమిస్తోందన్నారు.
ఆర్టికల్ 370, 35ఏ లాంటి బిల్లులను కూడా రాజ్యసభ పాస్ చేసిందన్నారు. ఎన్సీపీ, బీజేడీలు సభ సజావుగా సాగేందుకు సహకరించాయన్నారు. ఈ రెండు పార్టీలు పార్లమెంటరీ నియమావళిని అద్భుతంగా పాటించాయన్నారు. వాళ్లు ఎప్పుడూ వెల్‌లోకి దూసుకురాలేదన్నారు. అయినా వారి వారి సమస్యలను లేవనెత్తారన్నారు.
రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం ప్రత్యేక చర్చ చేపట్టారు. భారత రాజకీయాల్లో రాజ్యసభ పాత్రను ఈ సందర్భంగా నేతలు చర్చించారు. 1952లో రాజ్యసభ ఆరంభమైంది. అప్పటి నుంచి దేశ సామాజిక ఆర్థిక మార్పుల కోసం సభ పనిచేస్తోందని చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. 250వ సెషన్ సందర్భంగా ప్రత్యేక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. రాజ్యసభ ద జర్నీ సిన్స్ 1952 పుస్తకాన్ని ప్రచురించారు. హిందీ, ఇంగ్లీష్ బాషల్లో రాసిన 44 వ్యాసాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. 250 రూపాయల సిల్వర్ నాణెం, 5 రూపాయల పోస్టల్ స్టాంపు రిలీజ్ చేస్తున్నారు.
మరోవైపు, రాజ్యాంగ వ్యవస్థను పర్యవేక్షించడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. రాజ్యసభ 250వ సెషన్ సందర్భంగా మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడారు. తొందరపడి ఎటువంటి చట్టాలను ఆమోదించకుండా చూసుకునే బాధ్యత ఎంపీలపై ఉందని మాజీ ప్రధాని అన్నారు.
భావోద్వేగంగా కూడా ఎటువంటి చట్టాలను చేయరాదన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చలు చేపట్టేందుకు రాజ్యసభ కొంత సమయం కేటాయించాలని సూచించారు. రాజ్యసభ పర్మనెంట్ హౌజ్ అని, ప్రతి జనరల్ ఎలక్షన్ తర్వాత దీన్ని మళ్లీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. చట్టాల రూపకల్పనలో రాజ్యసభ పటిష్టంగా పనిచేస్తోందన్నారు. అనేక చట్టాలకు సవరణలు, కొత్త విషయాలను చేర్చడంలో రాజ్యసభ దోహదపడిందన్నారు. ప్రజలకు రాజ్యసభ ఉపయోగకరంగా ఉంటుందని తొలి చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారని గుర్తుచేశారు.
రాజ్యసభ నుంచే పార్లమెంటుకు ఎంపికైన మన్మోహన్ సింగ్ తన అనుభవాలని గుర్తు చేస్తుకున్నారు. ప్రతిపక్షనేతగా, ప్రధానిగా అనేక అంశాలపై రాజ్యసభలో ప్రసగించినట్లు ఆయన తెలిపారు. దేశానికి దిశానిర్ధేశం చేయడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
Comments
Post a Comment