ప్రత్యేకహోదా కోసం వేడేక్కనున్న పార్లమెంట్ సమావేశాలు


పోరుకు సిద్దమౌతున్న వైఎస్సార్ సీపి 


పార్లమెంట్  శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదాపై పట్టుపట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ పాలకపక్షమైన వైఎస్సార్‌ సీపీ కసరత్తు చేస్తోంది. పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్ తో ముందుకు సాగుతోంది. ఈ మేరకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పార్లమెంటు సభ్యులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరోసారి ప్రత్యేక హోదా నినాదాన్ని ఇవ్వడం ద్వారా పార్లమెంటు శీతాకాల సమావేశాలను వేడెక్కించేందుకు సన్నద్ధం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. లోకసభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్ సీపి ఈమేరకు  సంకేతాలను ఇచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలో ప్రతిపాదనల మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం ఈ నినాదం మీద వైసీపీ వ్యూహాత్మకంగానే మౌనం పాటించింది. కానీ తిరిగి ప్రత్యేక హోదా నినాదాన్ని పార్లమెంటరీ పార్టీల సమావేశంలో ప్రస్తావించడం ద్వారా సమర నినాదానికి సన్నద్ధం అవుతున్నదనే సంకేతాలను ఇస్తోంది. ఇప్పటికే అజెండాలో చేర్చాలని కూడా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి, లోకసభలో వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు మిథున్ రెడ్డిలు కూడా కోరారు. వాస్తవానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఇందుకు సంబంధించి ప్రత్యేక హోదాపై చర్చను లేవనెత్తే ప్రయత్నాల్లో ఉంది. దీనికి ప్రతిగా వైసీపీ కూడా ఉద్యమ స్థాయిలో పార్లమెంటు వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించడం రాజకీయ వేడిని పుట్టిస్తోంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా