అంతరాష్ట్ర రహదారి విస్తరణ పనులు చేపట్టకపోతే ఉద్యమిస్తాం...
సీలేరు /గూడెంకొత్తవీధి (జన హృదయం) :
సీలేరు విశాఖ ఏజెన్సీ జీకేవీధి మండలం ఆర్వీ నగర్ నుంచి తూర్పు గోదావరి జిల్లా పాలగెడ్డ వరకు గల 77 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కొరకు గత ప్రభుత్వం 87 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
మూడు దశాబ్దాలుగా ఈరహదారిని అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రాంతీయ క్రింది స్థాయి రాజకీయ నాయకులు ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో అన్ని పార్టీల రాజకీయ నాయకులు అఖిల పక్షంగా ఏర్పడి ఆదివారం దారకొండ సంతలో ఆర్వీ నగర్ నుంచి పాలగెడ్డ వరకు తక్షణమే అంతర్రాష్ట్ర రహదారి పనులు చేపట్టలని ర్యాలీ నిర్వహించారు.
అనంతరం స్థానిక పంచాయితీ సచివాలయంలో వారంతా సమావేశమయ్యారు.ఈనెల 25 న జీకేవీధి మండలం బంద్ నిర్వహించవలసిందిగా తీర్మానించుకున్నారు.
జీకేవీధి మండలాన్ని అన్ని విధాలుగా అటు ప్రభుత్వం ఒక వైపు అధికారులు చిన్న చూపు చూస్తున్నారని,
ఏ ప్రభుత్వం వచ్చినా ఎటువంటి అభివృద్ధికి ఈ మండలం నోచుకోవడం లేదని అఖిల పక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిషా,చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ రహదారి ప్రధాన మైనదని అటువంటి రహదారి మోకాళ్ల లోతు గోతులతో వుందని బ్రిటీష్ వారు నిర్మించిన రహదారిపై అప్పుడప్పుడు ప్రస్తుత అధికారులు మరమ్మతులు చేస్తున్నారు తప్పా ఇంత వరకూ పూర్తి స్థాయిలో రహదారి పనులు చేపట్టలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వందల గిరిజన గ్రామాలు రహదారి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గత సంవత్సరం బిజెపి కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు లోకుల గాంధీ రహదారి పనులు చేపట్టాలని నాలుగు రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేపడితే పాడేరు ప్రోజెక్ట్ అధికారి రహదారి పనులు పది రోజులలో చేపడతామని మాయ మాటలు చెప్పి దీక్షను విరమింపజేశారని నేటికి సంవత్సరం అవుతున్నా రహదారి పనులు చేపట్టకపోవడంపై అఖిలపక్ష నాయకులు మండి పడుతున్నారు.
ఈనెల 25 న ఆంధ్రా,ఒడిషా రాష్ట్రాల వారితో పిల్లగెడ్డ జంక్షన్ వద్ద వంటా వార్పు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అందరూ పాల్గొనాలని అఖిలపక్ష నాయకులు ప్రాంతీయులను కోరారు.ఈ కార్య క్రమంలో డిసిసి కార్యదర్శి కారెశ్రీనివాస్,జిల్లా సిపిఐ కార్య వర్గ సభ్యుడు సుంకరి విష్ణుమూర్తి, రాజుబాబు,మండల సీపీఐ సీపీఎం నాయకులు సత్తిబాబు, ఒంపురంగి బుజ్జిబాబు,బాకూరి కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ నాయకులు పోతురాజు మల్లుదొర,తగ్గి భీమ శంకర్,దుప్పులవాడ మాజీ సర్పంచ్ అల్లంగి రాజు,మాజీ ఎంపీటీసి సభ్యుడు కిల్లో గోపీనాధ్,గుమ్మిరేవుల సర్పంచ్ బాబూరావు, బిజెపి మండల నాయకులు గడుతూరి కోటి,తగ్గి వీరభద్రరావు జనసేన మాజీ నాయకుడు కొర్రా రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment