ఏయూలో సైన్స్ పార్క్ ను నెలకొల్పాలి :వీసీ
విశాఖపట్నం (జనహృదయం) : ఆంధ్రవిశ్వ విద్యాలయంలో శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు జరిపే దిశగా సైన్స్ పార్క్ ను నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఏయూ డాక్టర్ వి.ఎస్ క్రిష్ణా గ్రంధాలయంలో నిర్వహిస్తున్న గ్రంధాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని చిన్నారులకు ఉపయుక్తంగా గ్రంధాలయం, రీడింగ్ రూమ్ ను దాతల సహకారంతో నిర్మిస్తామన్నారు. డాక్టర్ వి.ఎస్. క్రిష్ణా గ్రంధాలయాన్ని నగరవాసులకు ఉపయుక్తంగా నిలపాలని సూచించారు. విద్యార్థులకు ఉపయుక్తంగా గ్రంధాలయం వేళలను పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. యువత అవసరాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా అవసరమైన మార్పులను చేపట్టాలని సూచించారు. డిజిటల్ అనుసంధానం చేయడం ఎంతో అవసరమన్నారు. త్వరలో ఏయూలో ఒక రీడింగ్ రూమ్ ను నిర్మించి ఇవ్వడానికి లవ్ అండ్ కేర్ నిర్వాహకులు డాక్టర్ ఏసుపాదం ముందుకు వచ్చారన్నారు. త్వరలో దీని నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఉద్యోగులు ఆత్మగౌరవంతో పనిచేయాలని, విద్యార్థుల ఆనందమే లక్ష్యంగా సేవలు అందిచాలని సూచించారు.
Comments
Post a Comment