వి సి లతో గవర్నర్ భేటీ

అమరావతి:  గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తొలిసారి రాష్ట్రంలోని పలు వర్సిటీల ఉపకులపతులతో సమావేశం కానున్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో జరిగే వీసీల సదస్సుకు మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా హాజరవుతారు. 20 వర్సిటీల పనితీరుపై వీసీలు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. పరిశ్రమల రంగంతో వర్సిటీల అనుసంధానత, పాఠ్యాంశాల ఉన్నతీకరణ వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తారు. పూర్తిస్థాయి ఉపకులపతులు లేక స్వయం ప్రతిపత్తి హోదా గల వర్సిటీల్లో అభివృద్ధి, సంక్షేమ నిర్ణయాలు అటకెక్కాయి. తిరుపతిలోని ఎస్వీయూ, పద్మావతి, కుప్పంలోని ద్రవిడ వర్సిటీలకు వీసీలకు సెర్చ్‌ కమిటీ మూడేసి చొప్పన పేర్లు ప్రభుత్వానికి సిఫార్సు చేసినా... తుది నిర్ణయం రాలేదు. 


ఎస్​వీయూ రెగ్యులర్‌ వీసీ మే చివరి వారంలో రాజీనామా చేయగా... గడచిన ఆర్నెళ్లలో ఇద్దరు ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జ్ వీసీలుగా నియమించారు. పాలనావ్యవహారాలతో వారు నెలకు ఒకట్రెండు దఫాలకు మించి... తిరుపతికి రావడం లేదు. వర్సిటీ అధికారులే దస్త్రాలు అమరావతికి తెచ్చి సంతకాలు చేయించుకొని తీసుకెళ్తున్నారు.కీలకమైన పనులను రెగ్యులర్‌ వీసీ వచ్చాక చూద్దామంటూ పక్కన పెట్టేస్తున్నారు. వీసీ లేక ఎస్వీయూలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపు సమస్యగా మారింది. 


శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏడాదిగా రెక్టార్‌గా ఉన్న ఆచార్య ఉమే ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కీలక నిర్ణయాలేవీ తీసుకోలేరనే ప్రచారానికి అనుగుణంగానే స్నాతకోత్సవ సభలూ వాయిదా పడుతున్నాయి. ద్రవిడ వర్సిటీకీ ఆచార్య లోకనాథరెడ్డిని ఇన్‌ఛార్జి వీసీగా నియమించి ఆర్నెళ్లైనా... ఇంతవరకూ కొత్త వీసీ కోసం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేయలేదు. ఇతర యూనివర్సిటీల పరిస్థితీ ఇలాగే ఉన్న వేళ ఇవాళ్టి సదస్సులో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా