ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం ద్వారా అర్హులందరికీ భూములు


గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్. పి. సిసోడియా


విశాఖపట్నం: అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనులందరికీ పంట భూములు అందించాలదే ప్రభుత్వ సంకల్పం అని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి  ఆర్. పి. సిసోడియా తెలిపారు.  శనివారం నగరంలోని ఓ హోటల్లో ఈ విషయమై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, డి ఎఫ్ ఓ లతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006లో ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని తీసుకు వచ్చిందని, 13-12-2005 నాటికి అటవీ భూములను అనుభవిస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. అయితే గిరిజనుల అవగాహన లోపం మూలంగా ఎక్కువ మందికి పట్టాలు ఇవ్వలేక పోయినట్లు తెలిపారు. సరైన పత్రాలు, ఇవ్వకపోవడం సాక్ష్యాలు చూపక పోవడం మూలంగా కొన్నింటిని తిరస్కరించడం, పెండింగులో పెట్టడం జరిగింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ల సమయంలో దాన్ని గుర్తించి వచ్చే ఫిబ్రవరి నెల నాటికి అర్హత ఉన్న గిరిజనులు అందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అర్హులను గుర్తించి పట్టాలు పంపిణీ చేసేందుకు రెవిన్యూ, గిరిజన సంక్షేమ, అటవీశాఖ, సర్వే అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే హరిత వనాలను నాశనం చేయకుండా గిరిజనుల జీవనోపాధికి వారు వాస్తవంగా అనుభవిస్తున్న భూములను వారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కలసికట్టుగా వాస్తవ పరిస్థితులను తనిఖీ చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్ మాట్లాడుతూ 13 సంవత్సరాలు అయినా ఇప్పటికీ నిజమైన అర్హులందరికీ న్యాయం జరగలేదని భావిస్తున్నామన్నారు. పట్టాల కొరకు ఏ విధంగా దరఖాస్తు చేయాలి ఏ ఏ డాక్యుమెంట్లను సమర్పించాలి అనే విషయంలో వారికి అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. డి ఎఫ్ ఓ లు వారి అధికారాలను ఉపయోగించుకుని పట్టాలు మంజూరు చేయవచ్చన్నారు. అయితే వన సంరక్షణ సమితులు కు సంబంధించిన భూములలో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. అలాగే అభయారణ్యాలు లో అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని జీవనోపాధి పొందుతున్న వారి పట్ల సానుభూతితో వ్యవహరించవలసి ఉందన్నారు. విశాఖపట్నం జెసి శివ శంకర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ సూచించిన భూములకు అటవీ శాఖ నుండి సాంకేతికపరమైన ఇబ్బందులు  వస్తున్నాయన్నారు. పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ మాట్లాడుతూ పట్టాలు ఇచ్చిన భూములకు రైతు భరోసా ఇచ్చేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని, అటవీ గ్రామాలలో గిరిజనులకు ఇళ్ల నిర్మాణానికి కూడా ఇబ్బందులు వస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో లక్షా 9 వేల 540 ఎకరాలకు సంబంధించి 71 వేల 201 క్లైమ్ లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు వీటిలో 38 వేల 339 ఎకరాలకు సంబంధించిన 17410 దరఖాస్తులు పాతవి కాగా 71 వేల 201 ఎకరాలకు సంబంధించి 36 వేల 914 అర్జీలు కొత్తవి ఉన్నాయని చెప్పారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ పీఓ లు తమ పరిధిలో ఉన్న సమస్యలను గూర్చి వివరించారు. కోఆర్డినేటర్ ఎంవివిఎస్ మూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రదర్శించారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, విజయనగరం జెసి వెంకటరమణ రెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన జిల్లా డివిజినల్ ఫారెస్ట్ అధికారులు ఆర్డీవోలు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా