రివ్యూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం నిర్భయ కేసులో...

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అక్షయ్‌ తరపున దాఖలైన రివ్యూ పిటిషన్‌‌పై విచారించిన సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. దోషి అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌ తిరస్కరించిన సందర్భంలో ఉరిశిక్షపై పునఃసమీక్షించబోమని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసే యోచనలో దోషి అక్షమ్ తరపు న్యాయవాది ఉన్నట్లు తెలిసింది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్, హత్య కేసులో తనకు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలంటూ అక్షయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తప్పుకున్నారు. తన బంధువు ఒకరు ఇంతకు ముందు ఈ కేసును వాదించినందున తాను దీనిపై తీర్పు చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. దీంతో జస్టిస్ ఆర్. భానుమతి నేతృత్వంలోని నూతన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది.


ఈ కేసులో నిందితుడి తరపు లాయర్ డాక్టర్ ఏపీ సింగ్ వాదిస్తూ.. మరణ శిక్ష అనేది ప్రాచీనకాలం నాటి విధానమని పేర్కొన్నారు. ఈ శిక్షను అమలు చేయడం వల్ల నేరస్తుడు మరణిస్తాడు కానీ నేరం కాదని అన్నారు. మరణ శిక్ష విధించడం నేరగాళ్లు, దోషులను నిరోధించేలా ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పుకొచ్చారు. నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో తప్పుడు ఆధారాలతో విచారణ జరిపారని ఆరోపించారు. మీడియా, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే తన క్లయింటును దోషిగా ప్రకటించారని ఏపీ సింగ్ పేర్కొన్నారు.


నిర్భయ స్నేహితుడిపైనా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అతడిపై పటియాలా హౌస్ కోర్టులో కేసు నమోదైందనీ.. అది ఈ నెల 20న విచారణకు రానుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ కేసుకు దీనికి సంబంధం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించడంతో... టీవీ చానెళ్లముందు కనిపించడం కోసం నిర్భయ స్నేహితుడు ''లంచం తీసుకున్నాడంటూ'' ఆరోపించారు. తన క్లయింటు అక్షయ్ కుమార్ అమాయకుడనీ.. పేదవాడని చెప్పుకొచ్చారు. అతడిపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని ఆరోపించారు. ఇంతకుముందు మరణ శిక్ష పడిన అనేక మంది ఇప్పటికీ సజీవంగా ఉన్నారనీ.. కానీ తన క్లయింటు అక్షయ్ కుమార్‌నే ఉరి తీసేందుకు ఢిల్లీ ప్రభుత్వం త్వరపడడం వెనుక ఆంతర్యమేంటని ఆయన వాదించారు. కేవలం రాజకీయ అజెండాతోనే ఉరిశిక్ష అమలు చేసేందుకు త్వరపడుతున్నారన్నారు.


'మరణ శిక్ష మానవ హక్కులకు, భారత సంస్కృతికి విరుద్ధం. గాంధీజీ మరణ శిక్షలను వ్యతిరేకించారు. వాయు కాలుష్యం కారణంగా మనం నివసిస్తున్న ఢిల్లీ గ్యాస్ చాంబర్‌‌లా తయారైంది. విషపూరిత వాతావరణం కారణంగా ఆయుష్షు తగ్గిపోతుంటే ఇంకా మరణ శిక్షలు ఎందుకు?'' అని నిందితుడి తరపు లాయర్ ధర్మాసనానికి విన్నవించారు. నిర్భయ మరణ వాంగ్మూలం కూడా ''అనుమానాస్పదం''గానే ఉందనీ.. పనిగట్టుకుని చెప్పించి దీన్ని తయారు చేశారని ఆయన ఆరోపించారు. ''ఇది ఆమె తనంత తానుగా చెప్పింది కాదు.. ఈ నేరానికి పాల్పడింది అక్షయ్ సింగేనని బాధితురాలు ఎక్కడా చెప్పలేదు. మొదటి వాంగ్మూలంలో నిందితులకు సంబంధించి ఆమె ఒక్క పేరుకూడా చెప్పలేదు. రక్తంలో వ్యాధికారక క్రిములుండే సెప్టికేమియా, అధిక ఔషధాల వాడకం వల్లే ఆమె మరణించింది'' అని లాయర్ వాదించారు. తప్పుడు ఆధారాలు సృష్టించి ఈ కేసులో తన క్లయింటు అక్షయ్‌ను ఇరికించారని ఆరోపించారు. ఈ కేసులో నిందితులను ఉరితీయడం వల్ల నిర్భయ తల్లిని సంతృప్తి పరిచినా... దీనివల్ల నాలుగు కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఆయన అన్నారు. పుట్టుకతోనే ఎవరూ రేపిస్టులు కాదనీ.. సమాజమే వారిని అలా తయారుచేసిందని సదరు లాయర్ చెప్పుకొచ్చారు. సమాజంలో అసలు అపరాధి నిరక్షరాస్యతేనని ఆయన వాదించారు.


కాగా ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులోని వాదనలన్నీ ఇంతకు ముందే చట్టబద్ధ ప్రక్రియలో పూర్తయ్యాయనీ.. ఇప్పుడు వాటిని మళ్లీ లేవనెత్తడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో కొత్త విషయం ఏదీ లేదని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. అమానవీయ కరమైన ఇలాంటి కేసుల్లో దోషులపై కనికరం చూపించకూడదన్నారు. ఈ కేసును సాగతీసేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారన్నారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు .. రివ్యూ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా