ఎపిలో వైసిపి యేతర కూటమి....
అమరావతి : రాష్ట్రంలో వైసిపి యేతర కూటమి నెలకొంటుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో నాటి శత్రువులు నేటి మిత్రులుగాను, నేటి మిత్రులు భవిష్యత్ లో శత్రువులుగాను మారుతున్న సంఘటనలు ఎన్నో చవిచూస్తున్నాం. ఈనేపథ్యంలో ఎపిలో పాలకవర్గం వైసిపీ మినహాయిస్తే తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజేపితో కలిసి కార్యాచరణ రూపొందిస్తుందా అనే చర్చ పలువురిలోనూ మొదలైందని చెప్పక తప్పదు. జనసేన అధినేత దేశానికి అమిషా నాయకత్వం అవసరమని కుండబద్దలు కొట్టడం, మరో ప్రకటనలో తెలుగుదేశం మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు పలకడంతో పాటు తమకు బిజేపితో శత్రుత్వం లేదని స్పష్టం చేయడంతో ఈవిషయం తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీతో తాము విడిపోయిందేమీ లేదని ఒక్క హోదా విషయంలోనే దూరంగా ఉన్నానంటూ పవన్ వ్యాఖ్యానించారు. అలాగే అమిత్ షా నాయకత్వమే దేశానికి అవసరం అంటూ పవన్ ప్రశంసించడం కూడా ఆ వాదనలకు బలం చేకూరుస్తోంది.
పవన్ వ్యాఖ్యల్లో తప్పేముంది..
ఇదిలావుంటే తాజాగా పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. పవన్ వ్యాఖ్యలను అలా చూడాల్సిన అవసరం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ లాంటి వ్యక్తి ఆలోచించే మాట్లాడతారన్న అచ్చెన్న.. బీజేపీ విషయంలో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అందులో తప్పేమీలేదని తేల్చేశారు. టీడీపీకి కూడా బీజేపీ ఏమీ శత్రువు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమకు వ్యతిరేకమని తామెప్పుడూ అనలేదన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని.. మూడున్నరేళ్ల వరకూ బీజేపీతో కలిసే ఉన్నామని గుర్తు చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరితే బీజేపీ పట్టించుకోలేదని అచ్చెన్న ఆరోపించారు. అందుకే బీజేపీకి దూరమైనట్లు చెప్పారు. అంతేకానీ తమకి కూడా శత్రుత్వం ఏమీ లేదంటూ చెప్పడం విశేషం. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారనే వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నామని అంతేకానీ జగన్‌తో ఏమైనా వ్యక్తిగత శత్రుత్వం ఏమైనా ఉందా అంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర మంత్రుల విమర్శలను అచ్చెన్న తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పవన్ నాయుడు అని వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మూకుమ్మడి దాడి చేయడం తగదని హితవు పలికారు. వైసీపీ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు అందరినీ కలుపుకుపోతామన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే అందరితో కలసిరౌండ్ టేబెల్ ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
Comments
Post a Comment