రాజధానిపై దశలవారీగా ఆందోళన

నేడు బంద్ కు పిలుపు నిచ్చిన రైతులు


అమరావతి : రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ... ఆందోళనలు తీవ్రం చేయాలని ఆ ప్రాంత ప్రజానీకం నిర్ణయించింది. భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసేందుకు అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయనిపాలెంలో... అన్నదాతలు, రైతు కూలీలు సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఇవాళ అమరావతి ప్రాంత బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొనాలని రైతులు కోరారు. 


సచివాలయం ఉన్న వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చేవరకూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. అమరావతి కోసం పోరు సాగిస్తామని రైతులు చెబుతున్నారు.రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకూ వెనకాడబోమని హెచ్చరించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ప్రాంతాన్ని మార్చడం అంటే ఆయన్ను అవమానించడమేనని అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే... 3 రాజధానులు ఏర్పాటు చేయడమా అని రైతులందరూ ఆందోళన చేస్తున్నారు.


అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం


అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్, 34 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నాయని, తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా... శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా