యువతరం నిరసన ఆపేందుకు పోలీస్ టెక్నిక్

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు ఓ పోలీసు చేసిన వినూత్న ప్రయత్నం ఎందరో మనసుల్ని తాకింది. వారి హృదయాల్లోని దేశభక్తిని తట్టిలేపింది. అంతే అప్పటిదాకా నినాదాలతో హోరెత్తించిన వారంతా మౌనంగా అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు.  ఇంతకీ ఎవరా పోలీసు.. ఏం చేశారంటే..
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు దేశమంతా విస్తరించిన విషయం తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ గురువారం పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని టౌన్‌హాల్‌ వద్దకు వందలాది మంది ఆందోళనకారులు చేరి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునేందుకు యత్నించారు. 
బెంగళూరు డీసీపీ చేతన్‌ సింగ్‌ రాఠోడ్‌ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఇలాంటి ఆందోళనలు చేయిస్తున్నాయని హెచ్చరించారు. అయినప్పటికీ నిరసనకారులు వినిపించుకోకపోవడంతో రాఠోడ్‌ వెంటనే 'జన గణ మన' అంటూ జాతీయ గీతం ఆలపించారు. అది వినగానే ఆందోళనకారులు కూడా లేచి నిలబడి డీసీపీతో కలిసి జాతీయ గీతం పాడారు. అనంతరం శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బెంగళూరు ఐజీపీ హేమంత్‌ నింబాల్కర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా